విచారించుకో నీవే వింతలు నాతోనేల
(॥పల్లవి॥)
విచారించుకో నీవే వింతలు నాతోనేల
పచారపు నీ చేఁతలు పట్టి చూపగలనా
(॥॥)
మొగమునఁ గళలెల్లా ముంచుకొని వుండఁగాను
నగరాదా నిన్నుఁ జూచి నాకు నీవేళ
నిగిడి సింగారమే నీకు వెంగమైతేను
మగువ నింత నేను మానుపఁగలనా
(॥॥)
చిడుముడితో నీ చెక్కుల వడియఁగాను
తుడువరాదా చెమట తొడఁగి నాకు
వుడిబడి నీ సుద్దలు వూరెల్లా నాడుకొంటే
తడయక నే నందు కుత్తర మియ్యఁగలనా
(॥॥)
వుప్పతిల్ల నీ మేననున్న పులకలు చూచి
కప్పరాదా పచ్చడము కడఁగి నాకు
యిప్పుడే శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
చిప్పిల సిగ్గువడఁగా చిమ్మిరేఁచఁగలనా
(||pallavi||)
visāriṁchugo nīve viṁtalu nādonela
pasārabu nī sem̐talu paṭṭi sūbagalanā
(||||)
mŏgamunam̐ gaḽalĕllā muṁchugŏni vuṁḍam̐gānu
nagarādā ninnum̐ jūsi nāgu nīveḽa
nigiḍi siṁgārame nīgu vĕṁgamaidenu
maguva niṁta nenu mānubam̐galanā
(||||)
siḍumuḍido nī sĕkkula vaḍiyam̐gānu
tuḍuvarādā sĕmaḍa tŏḍam̐gi nāgu
vuḍibaḍi nī suddalu vūrĕllā nāḍugŏṁṭe
taḍayaga ne naṁdu kuttara miyyam̐galanā
(||||)
vuppadilla nī menanunna pulagalu sūsi
kapparādā pachchaḍamu kaḍam̐gi nāgu
yippuḍe śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
sippila sigguvaḍam̐gā simmirem̐sam̐galanā