వీనికేలే వెఱవ నీకును విభుని పొందే సేయు మింకను
(॥పల్లవి॥)
వీనికేలే వెఱవ నీకును విభుని పొందే సేయు మింకను
మానవే యింక చింత యీతని మన్ననలు చేకూరెను
(॥వీని॥)
తలఁవుఁ దలఁవునుఁ దారుకాణై తగిలి యుండినఁ జాలుఁగాక
కలువలునుఁ దామరలు నెవ్వరి గాఁడిపారీనే
పలుఁగుఁబలుఁకునుఁ బొసఁగనాడుక పదరకుఁడినఁజాలుఁగాక
చిలుకలునుఁ గోవిలలుఁ జేసేటిచేఁత లేమింక నున్నవె
(॥వీని॥)
మొగము మొగమునుఁ జూచుకొని యిటు ముచ్చటాడినఁ జాలుఁగాక
చిగురులునుఁ దీగెలును యెవ్వరిఁ జెనకవచ్చీనే
నగవునగవునుఁ గలయనవ్వుచు ననిచివుండినఁ జాలుఁగాక
తగిలి చంద్రుడు చల్లగాలియుఁ దడవుపనులేమున్నవే
(॥వీని॥)
కరముఁగరమును సోఁక రతులనుఁ గాఁగిలినుఁ గాఁగిలిఁచినఁ జాలుఁగాక
మరుఁడు బలములుఁ గూడి యెవ్వరి మచ్చరించేరే
యిరవుకొని శ్రీవేంకటేశ్వరుఁ డింతలోఁదా నిన్ను నేలెను
తిరుగఁ దిరుగను విన్నవించేటి తెరఁగు లిఁక లేమున్నవే
(||pallavi||)
vīnigele vĕṟava nīgunu vibhuni pŏṁde seyu miṁkanu
mānave yiṁka siṁta yīdani mannanalu segūrĕnu
(||vīni||)
talam̐vum̐ dalam̐vunum̐ dārugāṇai tagili yuṁḍinam̐ jālum̐gāga
kaluvalunum̐ dāmaralu nĕvvari gām̐ḍibārīne
palum̐gum̐balum̐kunum̐ bŏsam̐ganāḍuga padaragum̐ḍinam̐jālum̐gāga
silugalunum̐ govilalum̐ jeseḍisem̐ta lemiṁka nunnavĕ
(||vīni||)
mŏgamu mŏgamunum̐ jūsugŏni yiḍu muchchaḍāḍinam̐ jālum̐gāga
sigurulunum̐ dīgĕlunu yĕvvarim̐ jĕnagavachchīne
nagavunagavunum̐ galayanavvusu nanisivuṁḍinam̐ jālum̐gāga
tagili saṁdruḍu sallagāliyum̐ daḍavubanulemunnave
(||vīni||)
karamum̐garamunu som̐ka radulanum̐ gām̐gilinum̐ gām̐gilim̐sinam̐ jālum̐gāga
marum̐ḍu balamulum̐ gūḍi yĕvvari machchariṁchere
yiravugŏni śhrīveṁkaḍeśhvarum̐ ḍiṁtalom̐dā ninnu nelĕnu
tirugam̐ diruganu vinnaviṁcheḍi tĕram̐gu lim̐ka lemunnave