Vattiyalugala neegu vachchinademi

వట్టియలుకల నీకు వచ్చినదేమి
Language

(॥పల్లవి॥)
వట్టియలుకల నీకు వచ్చినదేమి
యిట్టె చెలిని మన్నించి యింటికి రావయ్యా

(॥వట్టి॥)
ఆపెతో మాఁటాడితేను యములెల్లాఁ గరఁగు
చేపట్టి పెనఁగితేను చెమరించును
వోసి నవ్వు నవ్వితేను వొడదలెల్లాఁ బులకించు
తీపులుండఁగా జేఁదు తిననేఁటికయ్యా

(॥వట్టి॥)
సరుసఁ గూచుండి తేను సంతోసములు మించు
ఇరవై చూచితే కోర్కు లీడేరును
తిరమై గురులు నించితే కొంకుగొసరు మాను
వెరవుతో నీడలివె యెండలేలయ్యా

(॥వట్టి॥)
మోవితేనె లానితేను మోహములు చెలరేఁగు
భావించి సేసవెట్టితే ఫలము గద్దు
శ్రీవేంకటేశ కూడితి నీవేళనలమేల్మంగ
యీవల నీకె వుండఁగా నితరమేలయ్యా

(||pallavi||)
vaṭṭiyalugala nīgu vachchinademi
yiṭṭĕ sĕlini manniṁchi yiṁṭigi rāvayyā

(||vaṭṭi||)
ābĕdo mām̐ṭāḍidenu yamulĕllām̐ garam̐gu
sebaṭṭi pĕnam̐gidenu sĕmariṁchunu
vosi navvu navvidenu vŏḍadalĕllām̐ bulagiṁchu
tībuluṁḍam̐gā jem̐du tinanem̐ṭigayyā

(||vaṭṭi||)
sarusam̐ gūsuṁḍi tenu saṁtosamulu miṁchu
iravai sūside korgu līḍerunu
tiramai gurulu niṁchide kŏṁkugŏsaru mānu
vĕravudo nīḍalivĕ yĕṁḍalelayyā

(||vaṭṭi||)
movidenĕ lānidenu mohamulu sĕlarem̐gu
bhāviṁchi sesavĕṭṭide phalamu gaddu
śhrīveṁkaḍeśha kūḍidi nīveḽanalamelmaṁga
yīvala nīgĕ vuṁḍam̐gā nidaramelayyā