చెప్పకుండితేఁ బోదిఁక చెలికత్తెలము నేము
(॥పల్లవి॥)
చెప్పకుండితేఁ బోదిఁక చెలికత్తెలము నేము
కప్పి అన్నిటి కాపెనే కాఁగిలించరాదా
(॥చెప్ప॥)
తవిలి ఇంతులతోడ తారుకాణకు వచ్చేవు
వువిద నీ ఇంటిలోన నున్నది లేదా
వివరించి నిజములే వేమారు నెరవేవు
అవల నీ మేన నున్న దాపె సొమ్ముగాదా
(॥చెప్ప॥)
వోపుదునంటా నీవు వొట్లు వెట్టుకొనేవు
మాపుదాఁ నాపెతోడ మాటలాడవా
పైపై నిట్టె మాతో బాసలు సేసేవు గాక
యేపొద్దు నాపె చింత నీయెదలోనఁగాదా
(॥చెప్ప॥)
పలుమారు యీ నేమమే చారించవచ్చేవు
యెలమి యీమోవి ఆపె యెంగిలి గాదా
నెలవై శ్రీవేంకటేశ నేఁ డీకెఁగూడితివి
అలరి యీపొందు లాపె అనుమతే కాదా
(||pallavi||)
sĕppaguṁḍidem̐ bodim̐ka sĕligattĕlamu nemu
kappi anniḍi kābĕne kām̐giliṁcharādā
(||sĕppa||)
tavili iṁtuladoḍa tārugāṇagu vachchevu
vuvida nī iṁṭilona nunnadi ledā
vivariṁchi nijamule vemāru nĕravevu
avala nī mena nunna dābĕ sŏmmugādā
(||sĕppa||)
vobudunaṁṭā nīvu vŏṭlu vĕṭṭugŏnevu
mābudām̐ nābĕdoḍa māḍalāḍavā
paibai niṭṭĕ mādo bāsalu sesevu gāga
yebŏddu nābĕ siṁta nīyĕdalonam̐gādā
(||sĕppa||)
palumāru yī nemame sāriṁchavachchevu
yĕlami yīmovi ābĕ yĕṁgili gādā
nĕlavai śhrīveṁkaḍeśha nem̐ ḍīgĕm̐gūḍidivi
alari yībŏṁdu lābĕ anumade kādā