సతు లిందరితోడాను సాములు సేసే నీతో
(॥పల్లవి॥)
సతు లిందరితోడాను సాములు సేసే నీతో
మతకాన నేమెట్టు మాటాడేమయ్యా
(॥సతు॥)
విన్నవించఁగానే నీవు వేగిరించే వింతలోనే
సన్నలు సేయఁగానే సాదించేవు
కన్నుల మొక్కఁగానే కరఁగించే వప్పటిని
యిన్నిటా నీకు త్తరువు లెట్టు చెప్పేమయ్యా
(॥సతు॥)
దగ్గరఁ గూడుండఁగానే తమకించే వింతలోనే
సిగ్గులు వడఁగానే చెనకేవు
వొగ్గి విడెమియ్యఁగానే వొడివట్టే వప్పటిని
యెగ్గుదీర నూడిగము లెట్టు సేసేమయ్యా
(॥సతు॥)
సెలవుల నవ్వఁగానే చెక్కు నొక్కే వింతలోనే
తలఁచఁగానే కాఁగిటఁ దగిలి
అలమేలుమంగను నే నట్టె శ్రీవేంకటేశుఁడ
యెలమి నన్నేలితివి యెట్టు మెచ్చేమయ్యా
(||pallavi||)
sadu liṁdaridoḍānu sāmulu sese nīdo
madagāna nemĕṭṭu māḍāḍemayyā
(||sadu||)
vinnaviṁcham̐gāne nīvu vegiriṁche viṁtalone
sannalu seyam̐gāne sādiṁchevu
kannula mŏkkam̐gāne karam̐giṁche vappaḍini
yinniḍā nīgu ttaruvu lĕṭṭu sĕppemayyā
(||sadu||)
daggaram̐ gūḍuṁḍam̐gāne tamagiṁche viṁtalone
siggulu vaḍam̐gāne sĕnagevu
vŏggi viḍĕmiyyam̐gāne vŏḍivaṭṭe vappaḍini
yĕggudīra nūḍigamu lĕṭṭu sesemayyā
(||sadu||)
sĕlavula navvam̐gāne sĕkku nŏkke viṁtalone
talam̐sam̐gāne kām̐giḍam̐ dagili
alamelumaṁganu ne naṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍa
yĕlami nannelidivi yĕṭṭu mĕchchemayyā