పలుకుఁబంతము నొక్కపాటి గావద్దా
(॥పల్లవి॥)
పలుకుఁబంతము నొక్కపాటి గావద్దా
చెలుములు నలుకలు చెల్లునా విభుఁడా
(॥పలు॥)
ఇంతలో నీమాటలకు నెగ్గులెంచేవాఁడవైతే
చెంతల నన్ను ముందు చెనకనేల
సంతముగాకుండ రేపు జంకెన కోరువలేవు
కొంతగొంత తెగి కొంకఁగూడునా విభుఁడా
(॥పలు॥)
కొనగొనచేఁతలకే కోపగించేవాఁడవైతే
చనవిచ్చి సరసాలు జరపనేల
అనుకోకుండఁగలేవు అందుకు నిలువలేవు
వనధిలో లోఁతెంచవలెనా విభుఁడా
(॥పలు॥)
మత్తిలి మైసోఁకులకే మఱపొందేవాఁడవైతే
కొత్తగా శ్రీవేంకటేశ గుంపెనింతేల
హత్తినకూటమివలె నతిరాజసమువలె
తత్తరాలుఁ దామసాలుఁ దగునా విభుఁడా
(||pallavi||)
palugum̐baṁtamu nŏkkabāḍi gāvaddā
sĕlumulu nalugalu sĕllunā vibhum̐ḍā
(||palu||)
iṁtalo nīmāḍalagu nĕggulĕṁchevām̐ḍavaide
sĕṁtala nannu muṁdu sĕnaganela
saṁtamugāguṁḍa rebu jaṁkĕna koruvalevu
kŏṁtagŏṁta tĕgi kŏṁkam̐gūḍunā vibhum̐ḍā
(||palu||)
kŏnagŏnasem̐talage kobagiṁchevām̐ḍavaide
sanavichchi sarasālu jarabanela
anugoguṁḍam̐galevu aṁdugu niluvalevu
vanadhilo lom̐tĕṁchavalĕnā vibhum̐ḍā
(||palu||)
mattili maisom̐kulage maṟabŏṁdevām̐ḍavaide
kŏttagā śhrīveṁkaḍeśha guṁpĕniṁtela
hattinagūḍamivalĕ nadirājasamuvalĕ
tattarālum̐ dāmasālum̐ dagunā vibhum̐ḍā