మంచిదాయ దానికేమి మమ్ముఁ గావ నీకే పోదు
(॥పల్లవి॥)
మంచిదాయ దానికేమి మమ్ముఁ గావ నీకే పోదు
నించి యింకా నీవే కరుణించేవు గాని
(॥మంచి॥)
యెప్పుడు జవ్వనధర్మ మెఱఁగనివాఁడవా
చెప్పనేల నీకు నిదె చింతగాదా
తప్పక యీపని నాతలనే వేగినదా
చొప్పులు నాపైనే నీవు చూపేవు గాని
(॥మంచి॥)
ముంచిన వలపులకు మొదలివాఁడవు గావా
యెంచనేల నీకు నిదె యితవు గాదా
పెంచి యీకతలు నాకె పేరువారి వున్నవా
అంచెలను నాకు ప్రసాదించేవు గాని
(॥మంచి॥)
నే నిన్నుఁగూడిన రతి నీవు నేర్పినవి గావా
మేను ముట్టి నీవు నన్ను మెచ్చఁ గలిగె
కోనేటి శ్రీ వేంకటేశ కొదదీర్చి కూడితివి
వీనులు చల్లఁగా నింకా వేఁడుకొనేవు గాని
(||pallavi||)
maṁchidāya dānigemi mammum̐ gāva nīge podu
niṁchi yiṁkā nīve karuṇiṁchevu gāni
(||maṁchi||)
yĕppuḍu javvanadharma mĕṟam̐ganivām̐ḍavā
sĕppanela nīgu nidĕ siṁtagādā
tappaga yībani nādalane veginadā
sŏppulu nābaine nīvu sūbevu gāni
(||maṁchi||)
muṁchina valabulagu mŏdalivām̐ḍavu gāvā
yĕṁchanela nīgu nidĕ yidavu gādā
pĕṁchi yīgadalu nāgĕ peruvāri vunnavā
aṁchĕlanu nāgu prasādiṁchevu gāni
(||maṁchi||)
ne ninnum̐gūḍina radi nīvu nerbinavi gāvā
menu muṭṭi nīvu nannu mĕchcham̐ galigĕ
koneḍi śhrī veṁkaḍeśha kŏdadīrsi kūḍidivi
vīnulu sallam̐gā niṁkā vem̐ḍugŏnevu gāni