కరుణించు మీచెలి కడుఁబిన్నది
(॥పల్లవి॥)
కరుణించు మీచెలి కడుఁబిన్నది
సరసమాడేనంటా సముకాన నున్నది
(॥కరు॥)
నెలకొన్న వేడుకతో నీవెప్పుడు వత్తువంటా
కలికి యప్పటనుండీఁ గాచుకున్నది
మలసి తనతో నీవు మాటలాడినందాఁకా
తిలకించి లోలోనె తిమురుచునున్నది
(॥కరు॥)
మొనసి యెప్పుడు నీమొగము చూతునో యంటా
తనివోనితమకానఁ దగిలున్నది
చనవున నిన్నుఁ జేరి సరసమాడినదాఁకా
యెనలెనిమనసెల్లా నిక్కడనే వున్నది
(॥కరు॥)
కందువ నిన్నుఁ గాఁగిటఁ గాఁగిలించుకొనేనంటా
పొందులెల్లా మతిఁ చలపోయుచున్నది
యిందువచ్చి కూడితివి యీకెను శ్రీవేంకటేశ
విందులుగా మోవితేనె వేఁడుకొంటా నున్నది
(||pallavi||)
karuṇiṁchu mīsĕli kaḍum̐binnadi
sarasamāḍenaṁṭā samugāna nunnadi
(||karu||)
nĕlagŏnna veḍugado nīvĕppuḍu vattuvaṁṭā
kaligi yappaḍanuṁḍīm̐ gāsugunnadi
malasi tanado nīvu māḍalāḍinaṁdām̐kā
tilagiṁchi lolonĕ timurusununnadi
(||karu||)
mŏnasi yĕppuḍu nīmŏgamu sūduno yaṁṭā
tanivonidamagānam̐ dagilunnadi
sanavuna ninnum̐ jeri sarasamāḍinadām̐kā
yĕnalĕnimanasĕllā nikkaḍane vunnadi
(||karu||)
kaṁduva ninnum̐ gām̐giḍam̐ gām̐giliṁchugŏnenaṁṭā
pŏṁdulĕllā madim̐ salaboyusunnadi
yiṁduvachchi kūḍidivi yīgĕnu śhrīveṁkaḍeśha
viṁdulugā movidenĕ vem̐ḍugŏṁṭā nunnadi