ఇట్టుండవలదా యిద్దరికి సంతోషాలు
(॥పల్లవి॥)
ఇట్టుండవలదా యిద్దరికి సంతోషాలు
మట్టుమీరి తలపోఁత మఱవలే రెపుడు
(॥ఇట్లుఁ॥)
యెన్నటిపొందులో కానియీకెకు నాతనికిని
సన్నలా చాయలా మోవి చవిగొనేరు
ఇన్నిటాను పొంతనాలె యెట్టు గూడెనోకాని
పన్నిన తమకములఁ బాసి వుండలేరు
(॥ఇట్లుఁ॥)
తగుల మెట్టిదో కాని తనకునుఁ దనకును
పగటున మోములు తప్పక చూచేరు
మొగి నోఁచిననోములు మున్నిటి వెట్టివోకాని
నగవులే పెంచక మానఁగజాల రిదివో
(॥ఇట్లుఁ॥)
వేడు కెట్టిదో కాని శ్రీవేంకటేశ్వరు కింతికి
వోడక రతికళల నుల్లసించేరు
కూడిననేరుపు లెంత గురులు సోఁకెనోకాని
జోడయినకాఁగిలి యెచ్చోటా విడువరు
(||pallavi||)
iṭṭuṁḍavaladā yiddarigi saṁtoṣhālu
maṭṭumīri talabom̐ta maṟavale rĕbuḍu
(||iṭlum̐||)
yĕnnaḍibŏṁdulo kāniyīgĕgu nādanigini
sannalā sāyalā movi savigŏneru
inniḍānu pŏṁtanālĕ yĕṭṭu gūḍĕnogāni
pannina tamagamulam̐ bāsi vuṁḍaleru
(||iṭlum̐||)
tagula mĕṭṭido kāni tanagunum̐ danagunu
pagaḍuna momulu tappaga sūseru
mŏgi nom̐sinanomulu munniḍi vĕṭṭivogāni
nagavule pĕṁchaga mānam̐gajāla ridivo
(||iṭlum̐||)
veḍu kĕṭṭido kāni śhrīveṁkaḍeśhvaru kiṁtigi
voḍaga radigaḽala nullasiṁcheru
kūḍinanerubu lĕṁta gurulu som̐kĕnogāni
joḍayinagām̐gili yĕchchoḍā viḍuvaru