ఏమి చెప్పేదే నీ సుద్దు లెన్ని యయినాఁ గలవు
(॥పల్లవి॥)
ఏమి చెప్పేదే నీ సుద్దు లెన్ని యయినాఁ గలవు
దోమటి నా గుణాలతో తులఁదూఁగేవటవే
(॥ఏమి॥)
చన్ను లెంత చూపినాను సరసమెంతాడినా
నిన్ననేఁటి మానిసివి నివే కదే
కన్ను లెంత గిరిపినా కతలెంత చెప్పినాను
యెన్నఁగ నాతోడ నీవు యీడువచ్చేవటవే
(॥ఏమి॥)
సారె నెంత నవ్వినాను సంగాతా లెంత సేసినా
నేరుపులు వచరించ నీవే కదే
చేరి యెంత గాచుకున్నా చేఁత లెన్ని సేసినాను
మేరతో నాతని నీవు మెప్పించే వటవే
(॥ఏమి॥)
ఇచ్చక మెంత సేసినా నింపు లెన్ని చల్లినాను
నిచ్చలుఁ గూడేదానవు నీవేకదే
అచ్చపు శ్రీవేంకటేశుఁ డాదరించి నిన్ను నేలె
పచ్చిరతులకు నీవూఁ బాలిదానవటవే
(||pallavi||)
emi sĕppede nī suddu lĕnni yayinām̐ galavu
domaḍi nā guṇālado tulam̐dūm̐gevaḍave
(||emi||)
sannu lĕṁta sūbinānu sarasamĕṁtāḍinā
ninnanem̐ṭi mānisivi nive kade
kannu lĕṁta giribinā kadalĕṁta sĕppinānu
yĕnnam̐ga nādoḍa nīvu yīḍuvachchevaḍave
(||emi||)
sārĕ nĕṁta navvinānu saṁgādā lĕṁta sesinā
nerubulu vasariṁcha nīve kade
seri yĕṁta gāsugunnā sem̐ta lĕnni sesinānu
merado nādani nīvu mĕppiṁche vaḍave
(||emi||)
ichchaga mĕṁta sesinā niṁpu lĕnni sallinānu
nichchalum̐ gūḍedānavu nīvegade
achchabu śhrīveṁkaḍeśhum̐ ḍādariṁchi ninnu nelĕ
pachchiradulagu nīvūm̐ bālidānavaḍave