ఏమీ ననము నేము యిందుకు నిన్ను
(॥పల్లవి॥)
ఏమీ ననము నేము యిందుకు నిన్ను
దీమసాన నాపె గుట్టు తెలుసుకోవయ్యా
(॥ఏమీ॥)
చెప్పసిగ్గువడే నదె చెలి నీతో మాఁటలు
అప్పుడే యేకతమున నడుగవయ్యా
తప్పుగాదు మఱఁగున దండనే వుండేముగాని
చప్పుడుసేయ కిద్దరు సందించుకోరయ్యా
(॥ఏమీ॥)
నవ్వఁగ లోఁగీ నదె నాతి నీ మొగము చూచి
అవ్వలను వెడ్డువెట్టి అరయవయ్యా
మువ్వంకలాను చెవులు మూసుకవుండేవుగాని
నివ్వటిల్ల నాసుద్దులు నీవు వినవయ్యా
(॥ఏమీ॥)
సన్నలే చేసీ నదె సకియ నీకాఁగిటికి
మన్నించి కలసితివి మరుగవయ్యా
యిన్నిటా శ్రీవేంకటేశ యిందే యెనసేముగాని
పన్నిన మీ వలపులు పచారించరయ్యా
(||pallavi||)
emī nanamu nemu yiṁdugu ninnu
dīmasāna nābĕ guṭṭu tĕlusugovayyā
(||emī||)
sĕppasigguvaḍe nadĕ sĕli nīdo mām̐ṭalu
appuḍe yegadamuna naḍugavayyā
tappugādu maṟam̐guna daṁḍane vuṁḍemugāni
sappuḍuseya kiddaru saṁdiṁchugorayyā
(||emī||)
navvam̐ga lom̐gī nadĕ nādi nī mŏgamu sūsi
avvalanu vĕḍḍuvĕṭṭi arayavayyā
muvvaṁkalānu sĕvulu mūsugavuṁḍevugāni
nivvaḍilla nāsuddulu nīvu vinavayyā
(||emī||)
sannale sesī nadĕ sagiya nīgām̐giḍigi
manniṁchi kalasidivi marugavayyā
yinniḍā śhrīveṁkaḍeśha yiṁde yĕnasemugāni
pannina mī valabulu pasāriṁcharayyā