అంగడిఁ బెట్టుకోకు నీ యాచారాలు
(॥పల్లవి॥)
అంగడిఁ బెట్టుకోకు నీ యాచారాలు
చెంగట నన్నాడించితే చెల్లఁబెట్టేఁ బదరా
(॥అంగ॥)
కానికానితిట్లేల కాఁకలతో వొట్లేల
తేనెవంటినీగుణాలు తెలిపేవేరా
పూని కొంగు వట్టనేల బొమ్మల జంకించనేల
నానఁబెట్టి పరులతో నవ్వవా నీవు
(॥అంగ॥)
నిక్కి నిక్కి వాదులేల నెలఁతలపోదులేల
మొక్కినట్టే నీతప్పు మోపేవేరా
లెక్క లేనియానలేల లేఁతమాయ లిఁకనేల
చక్కనిసతులతోడ జాణతనాలాడేవా
(॥అంగ॥)
సారెసారె సన్నలేల సందిగొంది చిన్నెలేల
బీరమేల నిన్నే మెప్పించేలేరా
అరసి నేఁడు శ్రీ వేంకటాధిప కూడితి నన్ను
వోరి నీవింతకతొల్లె వొకరి నెఱఁగవా
(||pallavi||)
aṁgaḍim̐ bĕṭṭugogu nī yāsārālu
sĕṁgaḍa nannāḍiṁchide sĕllam̐bĕṭṭem̐ badarā
(||aṁga||)
kānigānidiṭlela kām̐kalado vŏṭlela
tenĕvaṁṭinīguṇālu tĕlibeverā
pūni kŏṁgu vaṭṭanela bŏmmala jaṁkiṁchanela
nānam̐bĕṭṭi parulado navvavā nīvu
(||aṁga||)
nikki nikki vādulela nĕlam̐talabodulela
mŏkkinaṭṭe nīdappu mobeverā
lĕkka leniyānalela lem̐tamāya lim̐kanela
sakkanisaduladoḍa jāṇadanālāḍevā
(||aṁga||)
sārĕsārĕ sannalela saṁdigŏṁdi sinnĕlela
bīramela ninne mĕppiṁchelerā
arasi nem̐ḍu śhrī veṁkaḍādhiba kūḍidi nannu
vori nīviṁtagadŏllĕ vŏgari nĕṟam̐gavā