ఆనతీవయ్యా యింకా ననుమానా లేఁటికి
(॥పల్లవి॥)
ఆనతీవయ్యా యింకా ననుమానా లేఁటికి
యే నెపాలూ లేకున్న నిటువలెఁ జేసునా
(॥ఆన॥)
వసివాఁడు జూపులు వంచి నిన్నుఁ గొసరుచు
నసురుసురయ్యీఁ జెలి అది యేఁటికి
యెఁసగి యిందాఁకా మీరు యేకతాననె వుంటిరి
కనుగాటు రతులలోఁ గడమ యేమాయనో
(॥ఆన॥)
తలవంచుకొని నీతో తమకపు మాటలాడి
సొలయుచు నింతి మొక్కి పొలగిలీని
చలివాయ నిందాఁకా సరసము లాడితిరి
చలముతో మతికేమి సమ్మతిగాదాయనో
(॥ఆన॥)
సన్నలనే జంకించి జవ్వనపు మదమున
చన్ను మొన లటుచూపి సాదించీని
యిన్నిటా శ్రీవెంకటేశ యెనసితి రిద్దరును
పన్నిన మీపంతముల బలిమి యెంతాయనో
(||pallavi||)
ānadīvayyā yiṁkā nanumānā lem̐ṭigi
ye nĕbālū legunna niḍuvalĕm̐ jesunā
(||āna||)
vasivām̐ḍu jūbulu vaṁchi ninnum̐ gŏsarusu
nasurusurayyīm̐ jĕli adi yem̐ṭigi
yĕm̐sagi yiṁdām̐kā mīru yegadānanĕ vuṁṭiri
kanugāḍu radulalom̐ gaḍama yemāyano
(||āna||)
talavaṁchugŏni nīdo tamagabu māḍalāḍi
sŏlayusu niṁti mŏkki pŏlagilīni
salivāya niṁdām̐kā sarasamu lāḍidiri
salamudo madigemi sammadigādāyano
(||āna||)
sannalane jaṁkiṁchi javvanabu madamuna
sannu mŏna laḍusūbi sādiṁchīni
yinniḍā śhrīvĕṁkaḍeśha yĕnasidi riddarunu
pannina mībaṁtamula balimi yĕṁtāyano